Tuesday, July 24, 2012

అందరూ సమానులే

అనగనగా ఒక ముసలాడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. అందుకనే ఒకకోడిని దొంగిలించుకొచ్చాడు. రహస్యంగా ఇంటికి వచ్చి కోడిని కాల్చుకుంటున్నాడు. ఇంతలో ఎవరో ఇంటి తలుపు తట్టారు.
తన దొంగతనం బయట పడిపోయిందేమోనని భయపడిపోయాడు ముసలతను. అందుకనే తలుపు తీయకుండా కూచున్నాడు. వచ్చినతనెవరో తలుపు దబదబా కొడుతూనే ఉన్నాడు.
“ఎవరు వచ్చిందీ? ఏం కావాలి?” విసిగి వేసారి, కూచున్న చోటినుంచే కేక వేశాడు ముసలాయన.
“నేను దేవుడిని. చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమయినా కావాలి!” జవాబు వచ్చింది.
“అయ్యో! నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేదు!” అన్నాడు వద్ధుడు.
“అబద్ధాలాడుతున్నావు. వాసన ఇక్కడి దాకా వస్తున్నది! నాకు తిండి పెడితే నీకు కోరిన వరాలిస్తాను!” అన్నాడు దేవుడు.
“నాకే వరమూ అక్కరలేదు. వెళ్ల”మన్నాడు ముసలతను.
“సరే! నాకెందుకు తిండి పెట్టగూడదనుకుంటున్నావ్?” ప్రశ్నించాడు దేవుడు.
“నువ్వు నన్ను బీదవాణ్ణి చేశావు. యింకొకరిని ధనవంతుడిగా చేశావు. నీకు పక్షపాతం ఎక్కువ! అందరినీ సమానంగా చూడలేని వారికి నేను తిండి పెట్టను! అది నా నియమం!” జవాబిచ్చాడు ముసలతను.
“నీవన్నది అక్షరాలా నిజం!” దేవుడు వెళ్లిపోయాడు.

కాసేపు తర్వాత మళ్లీ తలుపు తట్టిన చప్పుడు. ఈసారి వచ్చింది పవిత్రమాత.
“ఎవరదీ?” అన్నాడు వృద్ధుడు.
“నేను దైవమాతను. నాకు తినడానికేమయినా కావాలి.” జవాబు.
“నేను నీకేమీ యివ్వదలుచుకోలేదు. వెళ్లు తల్లీ!” అన్నాడతను.
“ఎందుకు?” ప్రశ్నించిందామె.
“నీవూ ఆ దేవుడి లాంటి దానివే! సమానదృష్టి లేనిదానివి!”
జవాబు విన్న దైవమాత మారు మాటాడకుండా వెళ్లిపోయింది.

ఈలోగా వంట పూర్తయింది. ముసలాయన తినడానికి సిద్ధంగా కూచున్నాడు. మళ్లీ తలుపు తట్టిన చప్పుడు. “ఈసారి ఎవరయి ఉంటారో?” అనుకున్నాడు వృద్ధుడు. తలుపు దగ్గర నిలుచుంది మృత్యుదేవత.
“కోడివాసన భలేగా వస్తోంది1 నీక్కాస్త సాయం పడదామని వచ్చాను!”
“ఓహ్! నువ్వా! రా లోపలికి. అన్నట్లు, నీ దృష్టిలో అందరూ సమానులే గదా?” అన్నాడు వృద్ధుడు.
“అవును. నాకెవరిపట్లా అభిమానం లేదు. దరిద్రుడూ, ధనవంతుడూ, పిన్నవాడూ, పెద్దవాడూ, రోగిష్టీ, ఆరోగ్యవంతుడూ, నాకందరూ ఒకేలా కనిపిస్తారు.” అంది మృత్యువు.
“నాకు తెలుసు. అందుకనే నిన్ను లోపలికి రమ్మన్నాను. రా! భోజనం చేద్దాం!” సంతోషంగా ఆహ్వానించాడు ముసలాయన.
వాళ్లిద్దరూ కలిసి హాయిగా విందారగించారు.

టావో సిద్ధాంతం.

పోయినవాళ్లు పోతే మిగిలిన వాళ్లకే దుఃఖం. మిగిలినవారికి ఇది ఒకరకంగా దుఃఖించడానికి కారణమయితే, సంతోషించడానికి కూడా ఇదే కారణమంటుంది టావో సిద్ధాంతం. తమవాళ్లు పోతే ఆబాధకు గురికానవసరం లేకుండా, పోయినవాళ్లు సుఖపడ్డారని భావం. మనవారికి అలాంటి అవకాశం దొరకడం మనకు సంతోషకరమే గదా.

టావో పండితుడొకాయన గురించి కథ ఒకటి చెబుతారు. ఆయనగారి భార్య పోయింది. బంధువులు, మిత్రులూ సంతాపం తెలియజేయడానికని వచ్చారు. పండితుడు మాత్రం హాయిగా పాడుతూ మద్దెల వాయిస్తున్నాడట.

“ఏమిటిది? ఇన్ని సంవత్సరాలు నీతో బతికిన నీ భార్య పోతే, నీవు సంతోషంగా పాడుతున్నావేమిటి?” అడిగారు బంధువులు. దానికాయనగారి జవాబు “నాకు భార్యంటే అమితమైన ప్రేమ. తను పోతే ముందు నాకు బాధే కలిగింది. కానీ ఆలోచించిన మీదట జీవితమంటే ఇంతేననిపించింది. అయితే తనకంటే ముందు నేనే పోతే ఏమయ్యుండేది. ఆవిడకు దుఃఖం. మళ్లీ పెళ్లి. ఏమో ఎలాంటివాడు దొరుకుతాడో? నా పిల్లల గతి ఏమయ్యుండేదో?”

“కన్నీళ్లు జీవితగతులను మార్చలేవు. ఇప్పుడు నా భార్య ప్రశాంతంగా ఉంది. నేను ఎడిచి పెడబొబ్బలు పెట్టి అల్లరి చేయడం భావ్యం కాదు. నేనే గనుక అలా చేస్తే నాకు జీవితం గురించి మరణం గురించి అర్థం కానట్లే గదా!”